క్షంతవ్యులు (Kshantavyulu), భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) [book club suggestions TXT] 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu), భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) [book club suggestions TXT] 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
సరళ ముఖం ఆవేశంతో ప్రజ్వరిల్లిపోతోంది. కళ్లు మిలమిలా నిప్పుకణాల్లా మెరుస్తూన్నాయి. ‘‘మనస్సులో మీరెప్పుడూ నాకు అన్యాయం చేస్తూనే వున్నారు, రామంబాబూ. నేనంటే మీకేమాత్రమూ కనికరం లేదు. నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పురుషులు ఎంత కఠిన హృదయులు,’’ అంది.
‘‘వద్దు సరళా, నాకు ఒకసారి నీవొక వాగ్దానం చేశావు. జ్ఞాపకముందా’’ అన్నాను తను ఇంకా ఏదో చెప్పబోతూంటే.
‘‘అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు,” అంది నిస్పృహగా.
‘‘ఏ విధంగా సరళా? మానసికంగానా, శారీరకంగానా?’’ అన్నాను.
‘‘రెండు విధాల కూడా, ఇప్పుడు మీరు కఠిన హృదయులైపోయారు. మీరు కూడా అందరిలాగే అయిపోయారు. అయినా మీమీద నాకున్న ఆలోచనలు ఆవేశాలు ఏమీ మారలేదు. దానికితోడు హృదయాన్ని చీల్చి వేసే అపరిమితమైన సానుభూతి కూడా దానికి తోడైంది. అందుకనే ఈనాడు అణచివున్నదంతా విజృంభించింది,’’ అంది.
‘‘ఇప్పుడు నాకెంతో మనశ్శాంతి చేకూర్చావు, కృతజ్ఞుడుని సరళా,” అన్నాను.
“ధన్యురాలయ్యానని సంతృప్తిచెందమంటారా?’’ అంది వేదనాపూరిత నేత్రాలతో నాకేసి చూస్తూ.
"నన్నిలా ఆడిపోసుకోవడంసబబా సరళా," అన్నాను బాధతో.
“యశో లఖియాల మీదున్న నమ్మకం మీకు నామీదెందుకు లేదు?" అంది.
‘‘చెప్పానుకదా సరళా. నీవు నాకు సరిగా అర్ధం కావని,” అన్నాను.
సరళ ముఖం హఠాత్తుగా మళ్లీ ఎర్రబడిపోయింది.
“ఎందుకు అర్ధం కాను రామంబాబూ, నాలో అంత అర్ధం కానిదేముంది. అందరిలాగే నేను కూడా ఒక సాధారణ స్త్రీని. అయితే మీకు అర్ధమయ్యేటట్లు విడమర్చి చెప్పమంటారా?’’ అంది వుద్రిక్తతతో, కోపంతో.
‘‘వద్దు సరళా వద్దు, ఇలాగే గడిచిపోనీ, దాని వల్ల కలిగే లాభమేమి లేదు,’’ అన్నాను.
సరళ ఏమీ మాట్లాడలేదు, బలవంతాన వుద్రేకాన్ని అణుచుకుంటూన్నట్లు కనబడింది.
“బాబుకి అన్నీ నీ పోలికలే వచ్చాయి కదూ సరళా?’’అన్నాను.
‘‘పోలికలు నావి, పేరు మీది. బాగుంది కదూ రామంబాబూ. మీకు బాబు అంటే చాలా ఇష్టం కదూ,’’ అంది చిరునవ్వులు చిందిస్తూ.
తల్లి ప్రేమంటే ఏమిటో ఆనాడు తెలిసింది. అలాంటి సమయంలో కూడా కొడుకు తలపుకు వచ్చి నవ్వకుండా వుండలేకపోయింది. మాతృ ప్రేమ ఒకసారి పెల్లుబికింది. సరళ ముఖంలో క్షణకాలం పూర్వపు వెలుగు కనబడింది.
“అవును సరళా చాలా ఇష్టం, నాకు పిల్లలంటేనే ఇష్టం అందులో నీకొడుకు కనుక మరీ ఇష్టం. నువ్వు పెద్దైన తర్వాత నిన్ను సుఖపెడతాడు. కానీ సరళా బాబుని నువ్వు కొంత నిర్లక్ష్యం చేస్తుంటావేమో అనిపించింది నాకు. వాడికి తల్లి ప్రేమ కొరవడనియ్యకు,’’ అన్నాను.
‘‘లేదు రామంబాబూ, బయటికి నేను అలా కనబడతాను. కాని నా ఆశలన్నీ వాడిమీదే ఉన్నాయి,’’ అంది
"నా అపోహ తొలి గినందుకు సంతోషం," అన్నాను.
“సంతోషం, కానీ నా సంతోషం మాత్రం మీకు ఏమాత్రం పట్టదు," అంది అందంగా.
“ఇది పరమ అన్యాయం,” అన్నాను.
"కాకపోతే ఆ నా రెండు సంతోష క్షణాలు ఏవో చెప్పండి,’’ అంది రెండు వేళ్ళు చూపిస్తూ.
"నేను స్పందనా రహితుడ ననుకున్నావా?" అన్నాను.
"అయితే శ్రవణానందపరచండి," అంది.
"నీ వీణా భంగిమ, నీ కొమ్ముల వాడి, నన్నెన్నడు విడనాడవే నారీశిరోమణీ," అన్నాను.
"ఈ జీవితానికి ఇది చాలు, అయినాగానీ," అని, తన పెదవులతో నాపెదవులు కల్పింది.
తాను విడిచిన పెదిమలు నేను మెదిపేలోపున సరళ గది గుమ్మం దాటింది.
చాప్టర్ 37
ఆరోజే సరళా లాఖియాల తిరుగు ప్రయాణం. ఇదిగో అదిగో నని పదిహేనురోజులుండిపోయారు వారిద్దరు యశో ని ఆ పరిస్థితులలో విదలలేక. ఇన్నిరోజులూ ఒక్కమాటైనా లఖియా నాతో ఒంటరిగాలేదు, నామటుకునేనూ తన్నిఆపుకోవడానికి ప్రయత్నించానూ లేదు.
"ఇక సెలవు తీసుకుంటాను రామం బాబు," అంది లఖియా, సరళతో బాటు నాకు వీడ్కోలుపలక వచ్చి.
"నన్ను క్షమించాలి లఖియా, నువ్వు రవిప్రకాష్గార్కిచ్చిన మాటవమ్ము చేయించినందుకు," అన్నాను.
"నేను రవిగారికిఫోన్ చేసి పరిస్థితి చెప్పాను, అర్ధంచేసుకున్నారు. మీరు గమ్మునికోలుకోవాలని చెప్పమన్నారు," అంది లఖియా.
"వారికినా ప్రతినమస్కారాలు తెలియచేయి. నన్నుదానిక్కూడా క్షమించు లఖియా," అన్నాను.
"నేను చెప్పదలుచు కున్నది వెళ్లేముందే చెప్పుంటే బహుశా ఈ అరిష్టం పట్ట్టేదేకాదు మీకు. ఉత్తరం ద్వారా తెలియచేద్దామనుకున్నాను కాని ఇప్పుడు తెలుసుకున్నాను ‘ఆలస్యంఅమ్రుతంవిషం’ లోని సత్యం. అందుకు మీరు యశో కలసి నన్ను క్షమించాలి," అంది లఖియా.
"ఏమిటి లఖియా నువుచెప్పాలనుకున్నది?" అడిగాను అందరికంటేముందు కుతూహలంఆపుకోలేక.
"రామం బాబు ఆరోజు మీరిచ్చిన షాక్ తరువాత రవిగారిచ్చిన ట్రీట్మెంట్ నా జీవితంలో జీవం పోయగా నేను జీవితాన్ని జేవితంగా చూడటం మొదలుపెట్టేను. మనం ముస్సోరిలో గడిపిన వారంలో నే అనిచిందేమిటంటే, మనందరిలో ఒక్క రాజేంద్రగారే జీవితాన్ని జీవితంగా జీవిస్తున్నారేమోనని. నేను సాంస్కృతిక కుత్రిమ నీడలో నాజీవితాన్ని కుళ్లబెడుతుంటే మీరు మీ జీవితాన్ని గతస్మృతి మబ్బులో మరుగు పరచేరు గురువుకి పంగనామాలనుకోనంటే, మీకొక మాట చెప్పాలనుంది," అని ఊరుకొంది.
"తప్పక చెప్పు లఖియా, తనను మించిన శిష్యుని కన్నానా,' అన్నాను.
"మిమ్మలిని జీవచ్చవం చేసిన మీ అమర ప్రేమ మీ ఊహే కాకపోతే అక్కడికక్కడే గుండె పగిలి శశిని ఎప్పుడో పరలోకంలో జేరేవారు. అలాగే పాతివ్రత్యమే నాకు పరమార్ధమయితే, వైధవ్యాన్నికాపాడు కోవాలన్న వ్యర్ధ తపన బదులుగా సతికి దిగేదాన్ని. బహుశా మీ మానసిక దౌర్బల్యానికి నేను ప్రతిబింబం గనుకనే అందరికంటే నన్నెక్కువగా ప్రేమించానాని భ్రమపడ్డారు. ఇప్పుడు నేను ఆ లాఖియాను కాదు గనుక మీ ఆప్రేమ ఈపాటికే వాస్తవిక మేఘాలలో మిళిత మయ్యుంటుంది. మరి సరళ అయితే, అందని పళ్లకు అర్రులు చాస్తూ ఇంటనున్న ఫలాన్ని ఫ్రిడ్జిలో పడేసింది. ఇకపోతే యశో, తనకి జీవితంలో ఒక నిర్ధారిత లక్ష్యం వుంది, తాను దాన్ని చేరే మార్గం చేపట్టింది, అంతకంటే ముఖ్యం, ఆ ప్రయాణంలో
ఆనందానుభూతి పొందుతోంది."
"మనందరినీ కాచివడ పోసావు సరే, మరి రవిప్ప్రకాష్ గారి మాటేమిటి?" అంది సరళ.
"ఆయన ఆసక్తి కనబడుతున్నా నేను ఆశ పెంచుగోలేదు," అంది లఖియా యధాలాపంగా.
నే ఆత్మావలోకనంలో చేయి వూపుతుండగా యశో నన్ను విడిచి వాళ్ళను సాగనంపడానికివెళ్ళింది.
చాప్టర్ 38
ఆస్పత్రిలో ఇంకో రెండు నెలలు వున్నాను. యశోకి డాక్టర్ స్వరూప్ గారితో చనువు ఏర్పడింది. ఎవరితోనైనా చాలా సులభంగా స్నేహము చేసుకోగలదు యశో, ఆమె ముఖాన్ని మాటలని మందహాసాన్ని ఎవరూ జయించలేరు.
నాకూ గాయలన్నీ మానిపోయాయి. చెప్పిన విధంగా కుడి కాలి మడమ కింద భాగం నిరర్ధకమై పోయింది. ఈ రెండు నెలల్లో నాకూ డాక్టరుగారితో పరిచయం మరింత బలపడింది. మేమంటే ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. యశో మీద ఆప్యాయత ప్రదర్శించేవారు. యశో కూడా పూర్తిగా అది తిరిగి ఇచ్చేది. ఆమె కోరిక ప్రకారం యశోని ఆయన పేరుపెట్టి పిలిచేవారు.
ఆయన తరచుగా యశో అంత నిబ్బరమూ, ధైర్యమూ కల స్త్రీని నేనెక్కడా చూడలేదు అనేవారు.
‘‘అది ధైర్యమూ నిబ్బరమూ కాదు డాక్టరుగారూ, అదేమిటో మీ భార్య నడగండి,’’ అంది యశో ఒకసారి.
‘‘నా భార్య సంగతి నీకెలా తెలుసు యశో?” అన్నారాయన నవ్వుతూ
“బంగళా వారైనా, బర్మావారైనా స్త్రీ హృదయం ఒక రకంగానే వుంటుంది డాక్టరుగారూ,’’అంది యశో.
‘‘మీరు చెప్పింది సత్యం కాదమ్మా, నేనే అనేక మంది రోగులను చూస్తూ వుంటాను. స్త్రీలలో కూడా క్రూరులు, కుత్సితులు వున్నారు. భర్తని వదిలి పరుల వెంట పోయే క్షుద్రమైన స్త్రీలను నేను చాలామందిని చూశాను,’’ అన్నారాయన.
‘‘వారంతా బయటకు కనబడేటంత చెడ్డవారు కాదు డాక్టరు గారూ. ఏదో ఒక బలమైన కారణం లేకుండా స్త్రీ కూడా భర్తను వదలి పెట్టదు. నా వుద్దేశంలో వారు నిర్దోషులు, సరళ ఇప్పుడిక్కడుంటే లేడిలా గంతేసి ‘హియర్ హియర్’ అని వుండును. మీరేమంటారు. రామంబాబూ,’’ అంది యశో.
‘‘చాలా వరకూ యశో చెప్పిందే నిజం డాక్టరు గారూ,’’ అన్నాను.
‘‘భార్య మాట తో ఏకీభవిస్తే ఏ తంటా ఉండదనుకున్నారేమో, ఉండండి డాక్టర్గా నా తఢాకా చూపిస్తా మీకు. సిస్టర్ సుగుణతో చెప్పి ఇవాళ రెండు ఇంజక్షన్లు ఎక్కువ ఇపిస్తాను, " అన్నారాయన నవ్వుతూ.
‘‘డాక్టరుగారు, మాకు మీ ప్రమీల పరిచయ భాగ్యం ఎప్పుడు కల్గిస్తారు?’’ అంది ఒక రోజున యశో.
ఎప్పుడూ నవ్వుతూవుండే ఆయన ముఖం నల్లబడింది.
‘‘యశో. నా ప్రమీల ఆత్మహత్య చేసుకుని మూడు సంవత్సరాలైంది,’’ అన్నారు డాక్టర్ స్వరూప్.
మేమిద్దరమూ దిగ్భ్రాంతులమయ్యాము, ఆయన మాటలను బట్టి వారిద్దరిదీ అన్యోన్య దాంపత్య మనుకునేవాళ్లం, కాసేపు సంశయించి కారణమడిగాను, అభ్యంతరం లేకపోతే చెప్పమన్నాను.
‘‘అభ్యంతర మేముంది రామంబాబూ. చెప్తాను, ప్రమీలను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లిచేసుకుని ప్రేమించాము. ఇద్దరమూ ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్లం. అప్పుడు మేము కలకత్తాలో వుండేవాళ్లం. ప్రమీలది చాలా సున్నితమైన మనస్సు, ఎంతో చక్కగా వుండేది. నాకు యశోని చూస్తోంటే ప్రమీల జ్ఞప్తికి వస్తుంది. ఏవో పోలికలు కనబడుతూంటాయి. పిల్లలంటే మాకు ఎంతో ఆపేక్షగా వుండేది. ప్రమీలకి పసిపాపలంటే ముఖ్యంగా మగపిల్లలంటే నిజంగా పిచ్చిగా వుండేది. పొరుగింటి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఆటలు అలంకారాలు జరిపేది. పెళ్లైన మూడు సంవత్సరాలకి ప్రమీలకి పిల్లలు పుట్టే సూచన కనబడింది. దీంతో మా ఇద్దరి సంతోషానికి అంతులేదు. ఎన్నో కలలు కన్నాము. రేయింబవళ్లు కూర్చుని పిల్లల దుస్తులు కుట్టుతూ వుండేది. అనేక కలలు కంది.
కళ్లల్లో నీళ్లు నిండగా తుడుచుకున్నారాయన.
“ఇలా వుండగా ప్రమీలకు పెద్ద జబ్బు చేసింది. పుట్టకమునుపే గర్భంలోనే శిశువు నశించి పోయింది. ఇక భవిష్యత్తులొ కూడా పుట్టే అవకాశం లేదని తేలిపోయింది. ఆ విషయం ప్రమీలకు తెలియకుండా వుండాలని ప్రయత్నించాను. కాని చెప్పడమే మంచిదని ఒకనాడు చెప్పాను. అది విని ప్రమీల నేను భయపడినంతగా దుఃఖించినట్లు కనపడలేదు. నిజానికి నేనెంతో పొరబడ్డాను. ఆమె ముఖం చూసి నేను జాగ్రత్త పడాల్సింది. దుఃఖ సమయంలో కన్నీరు కంటె మంచిది ఇంకొకటి లేదు. ఆ విషయం నేను అప్పుడు గ్రహించలేదు. డాక్టరు భార్య అవటం వల్ల ఆమెకు అన్ని మందులు గురించీ తెలుసు. ఒకనాటి రాత్రి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రాత్రి ఆమె ప్రవర్తన ఎంతో విచిత్రంగా వుంది. నేను మూర్ఖుడిని, మందబుద్ధిని అయి అప్పుడు నేను అది గ్రహించలేదు.
కాస్సేపు మాట మంతి లేక ఉండిపోయారాయన, ఆ సంఘటన నిన్నోమొన్నోజరిగినట్లు.
రాత్రి చాలా సేపటి వరకూ ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. పడుకుందామంటే ఇంకొంచెం సేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అని చాలా ఆలస్యం చేసింది. ఒకటి రెండుసార్లు కళ్లలో నీళ్లు చూశాను. భుజం మీద చేయివేస్తే గజగజ వణికింది. కారణమడిగితే ఇవాళ మనస్సు బాగోలేదు ఎందుకో భయంగా వుంది అంది. ‘‘పడుకుంటే అన్నీపోతాయి, పడుకో’’ అన్నాను. ‘‘అప్పుడు నాకు ఆలోచన కలుగలేదు. చివరికి నేను బలవంతంగా నిద్రపోయాను. ఎంత క్రూరంగా ప్రవర్తించాను. జీవితంలో ఎన్నో రాత్రులు వ్యర్ధంగా నిద్రపోతూ గడిపివేస్తూన్నాను. ఆ అయిదు గంటలూ నిద్రపోకపోతే నా ప్రమీల దక్కేదేమో, ఆ విషయం నాకు ఏ మాత్రం తెలిసివున్నా ఆమె మనస్సు మార్చివుండే వాడిని. నా మాట ఎప్పుడూ ఆమె కాదనలేదు. నా ప్రవర్తనలో కూడా ఏదో లోటు పాటు వుండి వుంటుంది. లేకపోతే ప్రమీల ఎప్పుడూ అలా చెయ్యదు. ఒక ఉత్తరం రాసి పరలోకం లోకి పయనించింది. అందులో జీవితమంతా సంతతి లేకుండా నేనుండలేను. నలుగురినోట ఆ మాట నేను వినలేను, నా ఆరోగ్య పరిస్థితి కారణంగా మీకు కూడా తండ్రి అయ్యే భాగ్యాన్ని నేను ఇవ్వలేకపోయాను. మన మిద్దరమూ కలసి కన్నకలల్ని నేను తుడివేస్తున్నాను. ఇంటిలోని ఆట బొమ్మలు, దుస్తులు చూస్తుంటే నేను భరించలేను. నేను వెళ్లిపోతాను. నన్ను మర్చిపోండి. నా మీద మీకేమైనా ప్రేమవుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి. ఆ విధంగా మీరు చేస్తే నా ఆత్మ శాంతిస్తుందని ప్రార్థిస్తున్నాను. నా అంతిమ కోరిక తీర్చండి. ఇంకొక సంగతి మీకు చెప్పకుండా మీవద్ద శలవు తీసుకోలేను. నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఏ భార్య ఏ భర్తనీ ప్రేమించలేదు, శలవు అని రాసింది. ఆమె వెంటనే నేను కూడా పోదామనుకున్నాను కాని వృద్ధ తల్లిదండ్రులయెడ కర్తవ్యం అడ్డొచ్చింది. ప్రమీల పోయి మూడు సంవత్సరాలైంది.’’ .
డాక్టరుగారు ప్రమీల గాధ చెప్తున్నంత సేపూ సర్వమూ మరచి విన్నాను. అంతా అయిపోయిన తర్వాత యశో ముఖం చూసి చకితుడ నయ్యాను. అంత క్రితం ఎప్పుడూ తనని ఆ విధంగా చూసినట్లు గుర్తులేదు. ఆమెలో దుఃఖం కంటే భయం ఎక్కువగా కనబడింది. ఆమె అంతరంగంలో సాగుతున్న ఆలోచలను ప్రమీల వృత్తాంతం బాహ్య ప్రపంచం లోకి తెచ్చిందా అన్న భావన కలిగింది నాకు. అమ్మీ కూడా ఈ విధంగా ఎప్పుడైనా ప్రమీలలా తలచిందా?
“అయితే మీరు ప్రమీల కోరిక నెరవేర్చరా డాక్టరుగారూ? అంది యశో కొంత సేపు మౌనంగా ఉండి
‘‘ఎన్నటికీ నెరవేర్చలేను, అదే నా దౌర్భాగ్యం,” అన్నారు డాక్టర్ స్వరూప్.
“మరణించిన వారి కోరికలు మనకు సాధ్యమైనంత వరకూ మన్నించాలి డాక్టరు గారూ. అయినా ఇందులో తప్పుకాని, నిందాకరమైనది కానీ ఏమీ లేదు. ప్రమీల చాలా దురదృష్టవంతురాలు, కానీ ఆమె మీకోసం ఎంతో త్యాగం చేసింది. ఇదంతా తనకోసమే అయితే అలా ఎన్నడూ చేసేది కాదనిపిస్తుంది,” అంది యశో.
‘‘అంటే ప్రమీల చేసింది మంచిదంటావా యశో, ఆత్మహత్యను సమర్ధిస్తున్నావా,” అన్నారు డాక్టర్.
‘‘మంచిదా, చెడ్డదా అనే ప్రశ్నకు సమాధానం నాదగ్గర లేదు డాక్టరుగారు. కాని ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అలా చేసుకుందో నేను అర్ధం చేసుకోగలను, ఆత్మహత్య చేసుకుని మీకు ఎంతో దు>ఖాన్ని మిగిల్చి వుండొచ్చు. కొన్ని కొన్ని కార్యాలకి పరిణామాలతోనూ పరులతోనూ, పరలోకంతోనూ నిమిత్తం లేదు,’’ అంది యశో.
ఈ సంభాషణ నన్ను చాలా కలవరపెట్టింది. అంత నిగూఢంగా మాట్లాడటం ఆమె స్వభావానికే విరుద్ధం. ఏదో సమస్య పెట్టుకుని మాట్లాడుతూందని స్పష్టమైంది. అది ఏమై వుంటుంది. ఆ తర్వాత కొంత కాలం వరకూ యశోలో ఒక విధమైన మార్పు గమనించాను. నేను నిద్రపోయి లేచేటప్పటికీ కిటికివద్ద నిలబడి బయటికి తదేకంగా చూస్తూ వుండేది. పిలిస్తే వులిక్కిపడి “మీరా” అనేది. ప్రమీల గాధ ఆమె హృదయంలో తుఫాను లేవదీసిందని గ్రహించాను. నాకు సంబంధించినంత వరకూ ప్రమీల కూడా నా దుఃఖిత స్త్రీల పట్టికలో ప్రవేశ నార్హత పొందింది.
‘‘ప్రమీల చాలా తప్పు చేసింది రామం బాబూ, భర్తకు చాలా అన్యాయం చేసింది. జన్మించటంలో మనకు ఎంత హక్కువుందో మరణించటంలో కూడా అంతే వుంది. ఆలోచించితే ఏమీ లేదని తేలుతుంది. ఆత్మహత్య సమర్థనీయమైన దైతే మానవకోటి క్షీనించివుండేది. ఏదో ఒక దుఃఖ కారణం ప్రతి వారికీ వుంటుంది. జీవితంలో మనకు లభించిన దానిని మనము స్వీకరించాలి. ప్రమీలకు నా సానుభూతి లభిస్తుంది. ఒప్పుదల కాదు భర్తకోసం అలా చేసింది. ఆమె పతివ్రతకాదా? ఆమె వుద్దేశాలు మంచివే రామంబాబూ, కాని ఆలోచనలు తప్పుదారి తొక్కాయి,’’ అంది యశో.
చాప్టర్ 39
ఇంటికి తీసుకొచ్చేసింది యశో, కాలుకి బదులు ఒక ధృడమైన కర్ర చేతికి లభించింది. అయినా దాని అవసరం కూడా అట్టే కలుగలేదు. యశో నా వెంట ఛాయలా వుండేది. నీడకూడా అప్పుడప్పుడూ మనకు కనబడదు. కాని యశో అలా కాదు. కొన్నాళ్లు పోయిన తర్వాత కూర్చొని నడుపుకోవడానికి వీలున్న ఒక కుర్చీకొంది. అందులో కూర్చుని ఇంట్లో తిరిగేవాడిని. సాయం సమయాల్లో బయటకు తీసుకెళ్తానంటే నేనే వద్దనేవాడిని, అభిమానంతో సిగ్గుతో హృదయం దహించుకుపోయేది. కుంటివాడిని కుర్చీలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తూంటే లోకులేమనుకుంటారు. అప్పుడప్పుడు వెన్నెల రాత్రుల్లో నిద్రావస్తలో వున్న కాశీనగరంలో గంగ ఒడ్డుకు వెళ్లినప్పుడు గడిపిన వెన్నెల రాత్రులు జ్ఞప్తికి వచ్చేవి. వాటికీ వీటికీ ఎంత తేడావుంది. నయనాలతో నవ్వుతూ నన్ను లేవదీయండీ . అన్న ఆ యశోకీ కుర్చీతోసుకుపోతున్న ఈమెకీ ఎంత బేధముంది. తామరతూడుల్లాంటి ఈమె చేతులను చూసి తన్మయుడైన ఆ వ్యక్తికీ ఈ నిరర్ధకుడికి ఎంత వ్యత్యాసముంది? యశో బయటికి ఉత్సాహంగానే కనబడింది. ఆమె నన్ను ఒంటరిగా ఎప్పుడూ విడవలేదు. అయినా అప్పుడప్పుడు హఠాత్తుగా ఆమె కళ్ల నీళ్లు నిండడం నేను చూచాను. నేను చూడకుండా వుండాలని ముఖం పక్కకు తిప్పుకొనో, లేక వంటసాకు చెప్పో లోపలికి వెళ్లిపోయేది.
డాక్టరుగారితో ఆస్పత్రి పరిచయం మేము వదులుకోలేదు. ఆయన చాలా తరచుగా మా ఇంటికి వచ్చేవారు.. ఎంతో హుషారుగా వుండేవారు. యశోని ఎంతో సులభంగా నవ్వించగలిగేవారు. ఆ విద్య నాకు సుతరామూ చేతకాదు. మనస్ఫూర్తిగా ఆమె నవ్వుతూంటే నేను ఎంతో ఆనందించేవాడిని.
“ప్రమీలనుకూడా ఇలాగే నవ్వించేవారా డాక్టరుగారూ?” అంది యశో ఒకసారి.
“నేను నవ్వించటం కాదు యశో, ప్రమీల నన్ను నవ్వించేది. మేమిద్దరమూ పుట్టబోయే కొడుకుకి ఏ పేరు పెట్టాలా అని చాలా మాట్లాడుకునేవాళ్లం. ఎన్ని పేర్లు చేప్పినా ఆమెకు నచ్చలేదు. ఒక రాత్రి హఠాత్తుగా నిద్రలేపి స్వరూప్ బాబూ. మీఅబ్బాయికి పెట్టాల్సిన పేరు నాకు ఇప్పుడు తట్టింది, బాదల్, “ అంది.
‘‘ప్రమీలకు నాకు పూర్వజన్మ సంబంధం యేదో వుండివుంటుంది డాక్టరుగారు, ఒక రాత్రి నాకు కూడా హఠాత్తుగా ఈ పేరు తట్టింది. అది చాలా కాలం క్రితం, అప్పుడు నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారికి ఆపేరు పెట్టాలనుకున్నాను. అది వీరికి పెట్టాను. ఇదంతా విచిత్రంగా వుంది,’’ అంది యశో వివర్ణ వదనంతో.
‘‘పూర్వ జన్మమా, పునర్జన్మమా ఇదంతా ఒక పెద్ద భ్రాంతి యశో. ఇలాంటి పిచ్చినమ్మకాలకు తావివ్వకు. ఒకే పేరు ఇరువురికి పెట్టడంలో ఆశ్చర్యమేమీలేదు,’’ అన్నారాయన నవ్వుతూ.
యశో మాట్లాడలేదు, మౌనంగా వుండిపోయింది. డాక్టరుగారు అనేకసార్లు నా కాలిని పరీక్షించడానికి ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేవారు. చాలా పరీక్షలు చేసేవారు.
“నువ్వు రామంబాబుని కలకత్తాకు తీసుకెళ్ళు యశో,“అన్నారు ఒకసారి ఆయన.
‘‘స్థలం మార్పుకోసం అయితే ముస్సోరీ తీసుకెళ్తాను,” అంది యశో.
నా గుండెల్లో రాయిపడింది, ప్రస్తుతం నేను వారిద్దరిని కలవడం అనుచితం.
‘‘నేను మిమల్ని కలకత్తా వైద్యం కోసం వెళ్లమంటున్నాను. డాక్టర్ గంగూలిగారు నాకు బాగా తెలుస, ఆయనకి ఉత్తరం రాసి ఇస్తాను. ఒక ఆపరేషన్ చేస్తే ఇప్పటికంటె కొంచెం కాలు కుదుట బడుతుంది. పూర్తిగా నయం కావడం కష్టం, కానీ ఎంచెప్పగలం, మెడికల్ మిరకల్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అయినా దానిక్కావల్సిన కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లేవు,’’ అన్నారు.
‘‘మీకు శతకోటి నమస్కారాలు డాక్టరుగారు ఇంత సువార్త నా జీవితంలో నేను వినలేదు. మీకు మేము జీవితాంతం కృతజ్ఞులంగా వుంటాము. ఇప్పుడే ఆ ఉత్తరం రాసి ఇవ్వండి. రేపే బయలుదేరి వెళ్తాం. ఇన్నాళ్లు ఇది చెప్పలేదేమీ మీరు!’’ అంది యశో చేతులు జోడించి.
“నిర్ధారణగా తెలిసేవరకూ చెప్పి మీలో అనవసరంగా ఆశలుపెంచదలచుకోలేదు. డాక్టర్ గంగూలీకి ఉత్తరం రాసి మీ కేస్ హిస్టరీతోపాటు రేపు ఇస్తాను,’’ అన్నారు.
ఇక ఆ రోజల్లా యశో సంతోషం పట్టలేక పోయింది. ఎప్పుడూ నేను ఆమెను అంత సంతోషంగా చూడలేదు. ఒక చక్కని పాట నేను అడక్కుండానే పాడి వినిపించింది. ఒక చిన్న నృత్యం కూడా చేసింది. అది అయిపోయిన తర్వాత నా మెడ చుట్టూ చేతులు వేసి, “బాదల్ బాబూ” అంది.
“కాలు బాగుపడుతుందని డాక్టరుగారు చెప్పలేదు యశో, నువ్వు పొరబడుతున్నావు,”అన్నాను..
“మెడికల్ మిరకల్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు అని చెప్పేరు, చెవుడేమైనా వచ్చిందా మీకు. పోనీ పూర్తిగా కాకపోయినా ఇంతకంటె మెరుగు పడుతుందిగా, నాకదే చాలు. మీకది చాలదా, కొంచెం కొంచెమైనా నడవగలుగుతారు. అయినా ఒంటరిగా మిమ్మల్ని ఎప్పుడూ నడవనివ్వను...నేను ఎల్లవేళలా మీకు తోడుగా వుంటాను, నక్షత్రకురాలిగా, సరేనా,” అంది హుషారుగా.
మరునాడే యశో నన్ను కలకత్తా తోలుకెళ్లింది. డాక్టర్ గంగూలిగారు నాకాలికి సరికొత్త ఆపరేషన్ చేసి యశో ఆశ మరింతపెంచారు. మూడు మాసాలు అయన ఆస్పత్రిలో సేవలుపొంది, నా కుడి కాలు నిలదొక్కు కుని, ఓ ఉదయం నేను కాశీ రైల్వే ప్లాట్ఫారం మీద ‘వాకర్తో’ నడుస్తుంటే, ఆరోజుని ప్రతి ఏటా 'శుభోదయం' గా జరుప నిశ్చయించింది యశో. ఇదంతా మానవమాత్రమా అనిపించిండి నాకా రోజంతా.
అలసి సొలసి వుండటం చేత ఆ రాత్రి యశో వెంటనే నిద్రపోయింది కానీ, చాలాసేపటివరకు నాకు నిద్రపట్టలేదు. వేర్వేరు ఆలోచనలు గుమిగూడి నా మెదడులో ప్రవేశించాయి.
యశో కనబర్చిన సంతోషం నన్ను కదిలించింది. మరుగుపడ్డ ఆలోచనలు తిరిగి మస్తిష్కంలో ప్రవేశించాయి. అడవి కాచిన వెన్నెల లాగ ఆమె జీవితం గడిచిపోతోంది; ఇరవైఆరు సంవత్సరాలు నిండబోతున్నాయి. ఇన్నాళ్లు ఈమె తన అందమూ యవ్వనమూ నాకోసం వృధా చేసింది. ఒక్కసారి కూడా ఆమె నాకా విషయం జ్ఞాపకం చెయ్యలేదు. నన్ను పల్లెత్తు మాటకూడా అనలేదు. యశోని చూస్తూంటే ఇంత వయస్సుందని ఎవ్వరూ అనుకోరు. ఆమె అందం చెక్కుచెదరకుండా వుంది. అదే రూపం, అదే విగ్రహం, అదే తీరు, అదే తెన్ను, అంతా అలాగే వుంది. ఆమె సౌందర్యం చూపరులను దిగ్భ్రాంతుల్ని చేస్తుంది. అది దేశ కాల మానాలకు అతీతం కామోసు! ప్రకృతి విరుద్దంగా ఇది అంతా జీవితాంతం వరకూ వృధా అయి చివరకు స్మశానవాటికలో బూడిద అయిపోవలసిందేనా? ఈ ఆలోచనాధోరణిలో హఠాత్తుగా ఎన్నడూరాని ఒక తలంపు నాకు స్ఫురించింది.
తప్పు చెయ్యకుండా దైవం ఎవరినీ శిక్షించడని ఒక సారి లఖియా అంది. నా విషయంలో కూడా అది నిజమేనేమో. వివాహం కాకుండా నేను, యశో కలసి ఇంతకాలం వుండటమే నేను కుంటివాడి నవడానికి కారణమేమో? నా మీద ఆగ్రహించి ఆయన అలా చేశాడేమో? ఇప్పుడైనా తప్పు సరిదిద్దుకుంటే భవిష్యత్తులోనైనా సుఖపడగలమేమో? ఆ ఆలోచన కలిగిన వెంటనే మనస్సులో అంతర్యుద్దం ప్రారంభమయింది. అవును యశోని నేనెందుకు వివాహం చేసుకోకూడదు .అందువల్ల కలిగే నష్టమేమిటి? అయితే సుశీ సంగతి ఏమిటి? నా జీవితం నా యిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, కాని యశో జీవితాన్ని నాశనం చేసే అధికారం నాకు లేదు. జీవితాంతం వివాహం చేసుకోకూడదనే నిశ్చయం నాలో వుంటే యశోకి నామీద మమత ఏర్పడక మునుపే నా నిర్నయం గురించి తనకు చెప్పివుండాల్సింది. అది వీలుపడకపోయినా మొదటిసారి విడిచిని తరువాత, తిరిగి ఆమెను వెతుక్కుంటూ ఆశ్రమం వెళ్లటం వలన నేను తనకి తెలియ పరచిందేమిటి? ఆమెకు మొదట వుత్తరం రాసింది నేనే. మాటవరసకని నన్ను అక్కడకు రమ్మని రాస్తే అది పురస్కరించుకుని పరుగు పెట్టాను. మాసిపోయిన మమకారాన్ని చిగురింపచేశాను. ఆమె జీవితం నాశనంచేశాను. ఇంతకాలం అందరికి శ్రీరంగ నీతులు చెప్తూ నేను యశో జేవితంతో చెలగాట మాడుతున్నాను. నా హహిపోక్రసి యశో గుర్తించకుండా ఉంటుందా? అయినా ఆమె కెందుకింత ప్రేమ గౌరవం నామీద. ఇంత జరిగిన తర్వాత ఇంకా సుశీ సాకు చెప్పి ఈమెకు అన్యాయం చేయటం చాలాతప్పు.
హఠాత్తుగా లఖియా అన్న మాట జ్ఞాపకమొచ్చింది, "మిమ్మలిని జీవచ్చవం చేసిన మీ అమర ప్రేమ మీ ఊహే కాకపోతే అక్కడికక్కడే గుండె పగిలి శశిని ఎప్పుడో పరలోకంలో జేరేవారు". బహుశా అదీ నిజమే కావచ్చు. లఖియా ఇంతలో ఎంత ఎదిగింది!
Comments (0)