Chinna Rani Korika Telugu (BR Raksun), Rabindranth Tagore [fiction novels to read .TXT] 📗
- Author: Rabindranth Tagore
Book online «Chinna Rani Korika Telugu (BR Raksun), Rabindranth Tagore [fiction novels to read .TXT] 📗». Author Rabindranth Tagore
బెంగాలి కథ:
చిన్నరాణి కోరిక
మూలం: రవీంద్రనాథ్ టాగోర్
అనువాదం: సుంకర భాస్కర రావు
చిన్నరాణి అంతిమ గడియలు ముంచుకొచ్చినట్లుగా అనుకుంది.
జీవితం దుర్భరంగా తోచింది. ఏదీ ఆకర్షణీయంగా కనిపించలేదు. జీవించే కోరిక నశించింది. చివరి క్షణాలలో ఉన్నట్లు తల్పంపై నిస్త్రాణంగా పడి ఉంది. వైద్యుడు బోలెడు మందులు, గుళికలతో వచ్చాడు. తేనెతో రంగరించిన గుళికలు ఆమెకి నమ్మకంగా అందించాడు. తినండి అన్నాడు. ఆమె వాటిని పక్కకు నెట్టేసింది. ఈ వార్త రాజుగారి చెవులకు చేరింది. ఆయన హుటాహుటిన సభ నుంచి లేచారు. త్వరత్వరగా చిన్నరాణిగారి మందిరానికి వచ్చారు. ఆయన రాణిగారి పక్కన కూర్చుని, “ఏమైంది రాణీ? ఏమి కావాలో చెప్పు!” అన్నారు.
మనసులో బాధని అణుచుకుని రాణి సమాధానం ఇచ్చింది, “నన్ను ఏకాంతంగా వదిలి వెళ్లిపొండి. నా బాల్య స్నేహితురాలు, నా హృదయ సహభాగిని, నా మిత్రురాలు సంగటనిని ఒకసారి నా దగ్గరకి పంపించండి !”
వెంటనే సంగటని చిన్నరాణి దగ్గరికి వచ్చింది. చిన్నరాణి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, “ప్రియ సఖీ, రా కూర్చో. నీతో చాలా విషయాలు చెప్పాలి!” అంది.
“మనసు విప్పి అన్ని సంగతులూ నాకు చెప్పు!” అంది సంగటని ఎంతో నమ్మకంగా.
చిన్నరాణి మనసు విప్పి, ప్రియ సఖితో చెప్పటం ప్రారంభించింది.
నా ఏడు రాజభవనాల వెనుక పెద్దరాణి (దౌరాణి) మూడు రాజభవనాలు ఉండేవి. తర్వాత ఆ మూడు భవనాలు రెండుగా, రెండు ఒకటిగా మారి, తర్వాత అది కూడా కనిపించ కుండా పోయింది. ఆమె అంతఃపురాన్ని పూర్తిగా వదిలి కనిపించకుండా వెళ్లిపోయింది.
ఆ తర్వాత నా మనసు పెద్దరాణి గురించి పూర్తిగా మర్చిపోయింది.
ఆ రోజు డోల్ జాతర రంగుల హోళి పండుగ. నేను నా నెమలి ఆకారం మయూరపంఖిలో కూర్చుని, నదిలో రాజ నాట్యమందిరానికి ప్రయాణం చేస్తున్నాను. నా ప్రజలు బారులు తీరి మా రాకకి ఎదురు చూస్తున్నారు. రక్షకభటుల సైన్యం మా వెనుక వస్తున్నది. నాకు కుడివైపున మధురమైన మురళీ రవం వినిపించ సాగింది. నా ఎడమ వైపు మధుర మృదంగ నాదాలు వినిపిస్తున్నాయి.
సరిగ్గా అదే సమయంలో, బాట వెనుక, నది ఒడ్డున, గ్రామం చివర, చంపక వృక్షాల మధ్య నాకు ఒక పర్ణ కుటీరం కనిపించింది. ఆ కుటీరం చుట్టూ ఉన్న కంచె మీద అల్లుకున్న లతలపై అనేక అపరాజిత పుష్పాలు విరగకాసి వికసించి ఉన్నాయి. ఆ కుటీరం ముంగిట బియ్యపు పిండితో సుందరమైన ముగ్గు వేయబడి ఉంది. నా తల మీద గొడుగు పట్టిన యువతిని అడిగాను, “ఆహా! ఎంత అందంగా ఉంది! ఎవరిదా ఇల్లు? “
“పెద్దరాణి గారిది !“ అంది ఆ యువతి.
ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక నేను గదిలో చీకటిలో కూర్చొని ఉన్నాను. దీపాలు వెలిగించలేదు. నా నోటి నుంచి ఒక మాట కూడా బయటకి రాలేదు.
రాజు గారు వచ్చారు. “ఏమైంది ప్రేయసీ? నీకు ఏమి కావాలి? “అని రాజుగారు అడిగారు.
“ఈ రాజభవనంలో ఉండటం నాకిక ఎంత మాత్రమూ ఇష్టం లేదు.“ అని అన్నాను.
“బాధపడకు హృదయేశ్వరీ, ఏనుగు దంతాల గోడలతో ఓ పెద్ద ఇటికెల బంగళా నీ కోసం కట్టిస్తాను. తెల్లని ఆల్చిప్పల పోడితో నేల పాలనురుగులా తెల్లగా మెరిసేలా చేయిస్తాను. నేలమీద అంచులలో కలువ పూల మాలల చిత్రాలు వేయిస్తాను.“ అన్నారు రాజుగారు.
“మన భవనం వెనుక పూదోటల అవతల మట్టితో కట్టిన పర్ణ కుటీరంలో ఒంటరిగా ఉండాలని నా కోరిక“ అన్నాను నేను.
“ఒహో! అంతేనా? ఇదేమీ కష్టమైన సంగతే కాదు.“ అన్నారు రాజుగారు.
నా కోసం ప్రత్యేకంగా ఒక పర్ణశాల కట్టించారు. అయితే అది సమయంకాని సమయంలో పూచిన అడవిపువ్వు మాదిరిగా నాకు కనిపించింది. కట్టిన కాస్సేపటికే అది నాకు నచ్చకుండా పోయింది. అక్కడ ఉన్నంత సేపు అది నాకు అవమానంగానే కనిపించింది. కొన్ని రోజుల తరువాత, పవిత్రమైన స్నానజాత్ర. నదీ స్నానం పండుగ వచ్చింది. నేను నదిలో స్నానానికి వెళ్లాను. నా వెంట నూటఏడు మంది పరిచారికలు ఉన్నారు. సేవకులు నది ఒడ్డున మేము ఎవరికీ కనిపించకుండా అవసరమైన ఆకులదడి కట్టారు. మేమంతా స్నానం పూర్తి చేసాం.
మేము తిరిగి వస్తున్నప్పుడు, దడి అంచుని కొంచెం తొలగించి నేను బయటకి చూసాను. ఆహా! ఎవరామె? ఏ కుటుంబానికి చెందినది. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుని మెడలో వేసిన పూలమాలలోని పూలలా ఎంతో స్వచ్ఛంగా ఆమె కనిపిస్తున్నది. ఆమె చేతులకు తెల్లని మట్టి గాజులు ఉన్నాయి. ఎర్ర అంచుతో తెల్ల చీర కట్టుకుంది. ఆమె స్నానం చేసి ఒక చిన్న కుండతో నీళ్లు తీసుకు వస్తున్నది. ఆమె నీటి బిందువుల తడి కనిపించే ఆమె శిరోజాలపై సూర్యోదయం వెలుగు మిలమిల మెరుస్తోంది. ఆమె చేతిలోని మట్టి కుండ చుట్టూ ఇంద్రధనస్సు రంగులు వ్యాపిస్తూ ముచ్చటగా కనిపించాయి.
“ఎవరా యువతి? ఏ గుడిలో ఆమె పూజలు చేస్తున్నదో!” మరోసారి నేను అడిగాను.
“ఆమె మీకు తెలియదా? ఆమె మన పెద్ద రాణి గారు!”
నా గొడుగు పట్టుకున్న యువతి నవ్వుతూ సమాధానం చెప్పింది,
ఇంటికొచ్చాక నేను ఒంటరిగా కూర్చున్నాను. నోట మాట రాకుండా. రాజుగారు వచ్చి అడిగారు, “ఏమైంది? నాకేం కావాలి? ”
“నేను ప్రతి రోజూ ఉదయం నదిలో స్నానం చేసి, బకుల వృక్షం నీడ వరకు మట్టి కుండతో నీరు తీసుకుని రావాలన్నది నా కోరిక.” అన్నాను.
“అలాగే చెయ్యి రాణీ! దానికేమి భాగ్యం?” అన్నారు రాజుగారు.
వెంటనే జనం అటువైపు రాకుండా, చుట్టూ కాపలా ఏర్పాట్లు చేయబడ్డాయి.
నేను తెల్లని మట్టి గాజులు ధరించి, ఏర్ర అంచు తెల్ల చీర కట్టుకుని నదికి వెళ్లాను. స్నానం చేసి, కుండలో నీరు పట్టి తీసుకొస్తున్నాను. దడి దగ్గరకు వచ్చే లోపలే, నా చేతిలోని కుండ నేలకు జారి భళ్లున పగిలిపోయింది. నేను ఎదురు చూసిన చిత్రం కనిపించలేదు. నాకు అవమానంగా అనిపించింది. ఆ తరువాత వచ్చింది రాసజాత్ర, దైవ నాట్యోత్సవం.
పూర్ణ పౌర్ణమి రాత్రికి రాసపూదోటలో ముత్యాల పందిర్లు వేసారు. ఆ సుదీర్గ పండగ రాత్రి సంగీతోత్సవాలు మరియు నాట్యాలతో ఎంతో ఆనందంగా గడిచింది.
ఆ మరుసటి రోజు ఏనుగు అంబారిపై, మేలి ముసుగుతో కూర్చుని నేను ఇంటికి తిరిగి వస్తున్నాను. నేను అకస్మాత్తుగా అడవి మార్గంలో ఇరుకు బాటలో నడుస్తూ వస్తున్న ఒక బాలుడ్ని చూసాను. ఆతడి తల మీద బుట్టలో అడవి పూల మాలలు కనిపించాయి. ఆ బాలుడి చేతుల్లో ఒక బుట్టలో తాజాగా మేరిసే కలువపూలు కనిపించాయి. ఆ బుట్టలో తేనెలూరే అడవి ఫలాలు, లేత తాజా ఆకుకూరలు కనిపించాయి.
నాకు గొడుగు పట్టే యువతిని అడిగాను, “ఈ బాలుడి సేవలు అందుకుంటున్న ఆ అదృష్టవంతురాలైన తల్లి ఎవరు?”
గొడుగు పట్టే యువతి అంది, “మీకు తెలీదా? ఆ అబ్బాయి పెద్దరాణి గారి కుమారుడు! ఆ కలువపూలు, అడవి ఫలాలు, తాజా ఆకుకూరలు తన తల్లి కోసం తీసుకు వెళ్తున్నాడు.“
తర్వాత, ఇంటికొచ్చాక నేను ఒంటరిగా కూర్చున్నాను. నోట మాట రాకుండా. రాజుగారు వచ్చి అడిగారు, “ఏమైంది నీకు? నాకేం కావాలో చెప్పు.”
“రోజూ లేత తామర పూలు, అడవి ఫలాలు, లేత తాజా ఆకుకూరలు తినాలన్నది నా చిరకాల కోరిక. అయితే వాటిని నా కొడుకు స్వయంగా ఏరి, కోసి నా కోసం తీసుకు రావాలి.” అన్నాను.
“అలాగే, నీవు కోరినట్లే జరుగుతుంది.” అన్నారు రాజు గారు.
నేను బంగారు తల్పంపై కూర్చున్నాను. నా కుమారుడు బుట్టతో నేనడిగినవి తెచ్చాడు. అతడి శరీరం చెమటతో తడిచిపోయి ఉంది. అతడి ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. ఆ బుట్టని వాడు నిర్లక్ష్యంగా అలా నా ముందు పడేసినప్పుడు నాకెంతో అవమానంగా అనిపించింది.
ఆ తర్వాత జరిగినవన్నీ నాకు మనోవ్యథ కలిగించినవే. నేను ఒంటరిగా విచారంగా ఉంటాను. రాజుగారు వచ్చి, ఏమైంది నీకు? నాకేం కావాలో చెప్పు అని అడుగుతూనే ఉన్నారు. నేను రాజు గారి చిన్నరాణి (సువోరాణి) ని అయి ఉండీ కూడా, నాకేమికావాలో చెప్పటానికి సిగ్గు పడుతున్నాను. అందుకే నిన్ను పిలిపించాను. నా కోరిక నీకు మాత్రమే చెప్పుతున్నాను. ఆదరణలేని పెద్ద రాణి (దువోరాణి) బాధలు నాకు కావాలి.”
ప్రియసఖి ఆశ్చర్యంగా చిన్నరాణి బుగ్గలు తాకి, “అలా ఎందుకంటున్నావు?” అని అడిగింది.
“సాధారణమైన వెదురు మురళితో ఆమె సులభంగా సుమధుర రాగాలు పలికిస్తున్నది. నా దగ్గర ఉన్నది బంగారు మురళి అయినా, అది నాకు బరువుగానే ఉంది. అది చూడటానికి, దాచుకోవటానికి తప్ప మధుర రాగాలు పలికించ లేకపోతున్నది.” అంది చిన్నరాణి బాధగా.
_THE END_
ImprintText: Telugu: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Telugu: Sunkara Bhaskara Rao
Publication Date: 07-09-2015
All Rights Reserved
Comments (0)