Jeevana Nyayam, BR Sunkara [best big ereader .TXT] 📗
- Author: BR Sunkara
Book online «Jeevana Nyayam, BR Sunkara [best big ereader .TXT] 📗». Author BR Sunkara
American Story అమెరికన్ కథ
The Law of Life
జీవన న్యాయం
Jack London
జాక్ లండన్
Telugu Translation:
BR Sunkara
ఆ రెడ్ఇండియన్ ముసలివాడు మంచు మీద కూర్చున్నాడు. అతడి పేరు కొస్కూస్, ఒకప్పుడు తన జాతికి నాయకుడు. ఇప్పుడతడు చేయగలిగింది ఏమీ లేదు. ఒకచోట కూర్చోటం, ఇతరులు చెప్పేది వినటం మాత్రమే. అతడి కళ్ల వయసు పెరిగిపోయింది, ఏమీ చూడలేడు. అతడి చెవుల శక్తి పెరిగిపోయింది, ప్రతి చప్పుడు బాగా వినగలుగుతున్నాడు. చిన్న చప్పుడుని కూడా తన తెలివితేటలతో చక్కగా అర్థం చేసుకుని, కళ్లు చూడలేకున్నా అంతా చూసే శక్తిని అతడు పొందాడు.
అవును! అది సిట్-కమ్-టు-హా. స్లెజ్ మీద కూర్చుని “హా! హా!” అని అరుస్తూ, చర్మపు కొరడాతో కుక్కలని అదిలిస్తూ మంచు మీద స్లెజ్ నడుపుతూ ఉంది. సిట్-కమ్-టు-హా తన కూతురి కూతురు. ఆమె తన పనిలో మునిగిపోయి, ఒంటిరిగా నిస్సహాయంగా మంచుమీద కూర్చున్న తన తాత మీద జాలి చూపించే సమయం లేక ముందుకు వెళ్లిపోయింది. ఆమె అతన్ని మరిచిపోయింది, ఇతరులు కూడా. వేటకు అనువైన కొత్త మైదానాలు వెదుక్కోవడమే వాళ్ల ధ్యాస. వాళ్ల క్యాంప్ శిథిలమయ్యింది. మంచు మీద వాళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగిపోకూడదు. జీవితం ఆమెని పిలుస్తోంది, చావు కాదు. ఆ తెగ చనిపోవటానికి సిద్ధంగా లేదు. కొస్కూస్ తప్ప. అవును, కొస్కూస్ చావుకి దగ్గరగా కదులుతున్నాడు.
ఈ ఆలోచన కాసేపు అతన్ని కలవరపెట్టింది. అతడు వణుకుతున్న చేతిని మంచు మీద వెదగ్గా, ఒక ఎండు కట్టెపేళ్ల గుట్ట అతడి చేతికి తగిలింది- నీకు నేను సహాయం చేస్తాను అంటున్నట్టు. అతడికి అవి కొండంత బలం ఇచ్చాయి. అతడి చెవులు మళ్లీ వినిపించే చప్పుళ్లని కనిపించని కళ్లకి అందించి, వాటిని దృశ్యాలుగా మార్చ సాగాయి. నాయకుని గుడారంపై జంతు చర్మాలు మంచుకి గడ్డకట్టి, బిగుసుకుని, చిరుగులతో పటపటలాడుతున్నాయి. గుడారం కూలబోతుంది. ఆ తెగ నాయకుడు వేటలో గొప్ప బలశాలి. అతడు తన కొడుకు. కొస్కూస్ కొడుకు. కొస్కూస్ ని చనిపోవటానికి ఆ తెగ వదిలేసింది. నాయకుడు పనిచేస్తున్న ఆడవాళ్లని త్వరగా పనిచేయమని హెచ్చరిస్తున్నాడు. కొడుకు గొంతు కొస్కూస్ కి వినిపిస్తున్నది. గట్టిగా వినిపిస్తూ మాయమయ్యింది. కొస్కూస్ చెవులకి వినటం కష్టమయింది. ఆ గొంతు అతనికి అదే చివరి సారి. జీ-హౌ చప్పుళ్లు, టస్కన్ శబ్దాలు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, షా-మన్ మాత్రమే ఇంకా నిలబడి ఉండాలి. వాళ్లంతా పనిలో మునిగి వుంటారు. స్లెజ్ మీద సామాన్లు వేస్తూ షా-మన్ చిరాకు ప్రదర్శిస్తున్నాడు.
పసివాడు ఏడుస్తున్నాడు. ఊరుకోబెట్టటానికి స్త్రీ స్వరం పాట. ఆ పసివాడు కూ-టీ, అనారోగ్యంతో ఏడుస్తూనే ఉంటాడు. వాడు త్వరలో చనిపోతాడు. వాడిని పాతిపెట్టటానికి గడ్డకట్టిన టండ్రా మంచు నేలలో మంటపెట్టి గొయ్యి చేస్తారు, ఆ చిన్న శరీరాన్ని రాళ్లతో కప్పి, తోడేళ్ల నోట పడకుండా దానిని కాపాడతారు. ఆహా! ఇంకేముంది? కొన్నాళ్లు కడుపు నిండుగా, అన్నాళ్లూ ఆకలిగా. చివరికీ చావు. చావు ఎదురు చూస్తూనే ఉంటుంది. నిరంతర ఆకలితో. అందరికంటె ఎక్కువ ఆకలితో ఉండే కడుపు చావుదే.
ఏమిటది? జనం సామాను మోసుకెళ్లేందుకు, స్లెజ్లకు బలమైన చర్మపు తాళ్లు బిగిస్తున్నారు. అటుపై ఆ శబ్దాలు వినబడలేడు. చర్మపు కొరడాల శబ్దాలు గాలిని చీల్చి, కుక్కలను బెంబేలెత్తించి, స్లెజ్లని వేగంగా ముందుకు లాగేలా చేస్తున్నాయి. ఆ కుక్కల అరుపులు చెబుతున్నాయి- వాటికి పని మీద అసహ్యం పుట్టిందని, చావే మేలని. స్లెజ్ తరువాత స్లెజ్ చొప్పున నెమ్మదిగా అవి వెళ్తున్న చప్పుడు. అదీ ఇప్పుడు నిశ్శబ్దంలో కలిసిపోయింది. వాళ్లు కూడా అతని జీవితంలోంచి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు అన్నీ దూరమయ్యాయి. తన జీవితం చివరి గడియలని ఒంటరిగానే తానే ఎదుర్కోవాలి. ఎందుకంటే, కొస్కూస్ చావుకి చాలా దగ్గరలో ఉన్నాడు. మంచుమీద ఎవరో నడుస్తున్న చప్పుడు. తన పక్కన ఎవరో నిబడ్డారు. అతడి చెయ్య తన తల మీద మృదువుగా తాకింది. ఎవరై ఉంటారు? తనలాంటి ముసలి తండ్రుల కోసం ఆగని కొడుకులెందరో, అందరూ, ఆ ముసలివాళ్లందరూ గుర్తుకొచ్చారు. వాళ్లు ఆగలేదు, కాని తన కొడుకు ఆగాడు. తన కొడుకు వాళ్లలాంటివాడు కాదు, మంచివాడు. అందుకే వచ్చాడు అనుకున్నాడు.
యువనాయకుడి స్వరం అతన్ని వెనక్కి తీసుకొచ్చింది. గతంలోని సంఘటనలలో కొస్కూస్ సంచరించాడు.
“అదే నీ నిర్ణయమా?” అని అతడు అడిగాడు.
“నాకేమీ పర్వాలేదు.” ముసలివాడు అన్నాడు.
“నీ వెనక ఉన్నది అడవి, మంట వెలుగుని వేడిని ఇస్తుంది. ఉదయం మసకబారి ఉంటుంది. చలి గాలులు చెలరేగాయి. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నది, ఇప్పుడు కూడా.” అన్నాడు ఆ యువకుడు.
“అవును, ఇప్పుడు కూడా.” అన్నాడు ముసలివాడు.
“మన తెగ మనుషులు తొందరలో ఉన్నారు, వాళ్ల కూడా ఉన్న వస్తువులే బరువు. వాళ్ల కడుపులు ఖాళీ. ఎంత దూరం వెళ్లాలో తెలియదు. త్వరగా ప్రయాణం చేయాలి. వస్తాను, అంతా బాగుందా?”
“అంతా బాగానే ఉంది, నేను పండుటాకుని. ఎప్పుడు వదలాలో తెలియక, కొమ్మని పట్టుకుని వేలాడుతున్నాను. ఉదయం వీచే మొదటి బలమైన గాలికి నేను పడిపోతాను. నా అరుపులు అరణ్య రోదన. నా కళ్లు ఎక్కడకి నడవాలో నా కాళ్లకి చెప్పలేవు. నా కాళ్లు కూడా అలసిపోయాయి. అంతా బాగానే ఉంది.”
కురుస్తున్న ఆ మంచు వర్షం శబ్దాలు వింటూ అతడు తన ఆలోచనల్లో అలా ఎంత సేపు ఉన్నాడో తెలియదు. కొడుకు తాను పిలిచినా అందనంత దూరంలో పయనిస్తూ ఉంటాడని తెలుసు. అప్పుడు అతడి చెయ్యి కంగారుగా పక్కనున్న కట్టెల గుట్ట మీదకు మళ్లింది. తనకు, తన మీద ఆవలిస్తున్న పరిసరాలకు మధ్య ఉన్నవి ఇవే. చివరికి అతడి జీవితం కొన్ని కట్టెపుల్లలు మాత్రమే. అవి ఒక్కొక్కటిగా మంటలో హరించుకుపోయి, ఆ ముసలివాడికి ప్రాణదానం చేస్తాయి. అప్పుడు చావు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి అతడిని ఆక్రమిస్తుంది. చివరి కట్టె తన వేడిని అందించి మంటకి ఆహుతి కాగానే, మంచు తన ప్రతాపం చూపించటం ప్రారంభిస్తుంది. ముందు తన పాదాలు, ఆ తరువాత తన చేతులు శక్తి కోల్పోతాయి. నిస్సత్తువ తర్వాత తిమ్మిరి శరీరమంతా పాకుతుంది. ముందు నెమ్మది నెమ్మదిగా, ఆ తర్వాత వళ్లంతా పాకి తన మీద దాని ప్రతాపం చూపిస్తుంది. అతడి తల అతడి మోకాళ్ల మీదకు ఒరిగిపోతుంది. అంతే, తను చనిపోతాడు. ఇది చాలా సులభం.
దీన్ని ఎదిరించలేం, ఎదుర్కోవలసిందే. మనుష్యులంతా చావవలసిందే. విచారం తాకినా అతన్ని ఆక్రమించలేక పోయింది. ఇది జీవన నియమం. అతడు జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసాడు. చావు సహజం. చావు శరీర నియమం. ప్రకృతి శరీరం మీద దయ చూపదు. ప్రకృతికి వ్యక్తి కంటె జనం, వర్గాలు, జాతులే ముఖ్యం. ప్రకృతి నియమం పాటించినా, పాటించకపోయినా ప్రాణులు చావుని ఎదుర్కోవాల్సిందే. ఆ ముసలి కొస్కూస్ మనసులోని ఆలోచనలివి. వీటి గురించి జీవితంలో అతడెన్నో చూసాడు.
వసంతం వస్తుంది. చెట్లు చిగురిస్తాయి, అప్పుడేపుట్టిన లేత ఆకులు, మొగ్గలు, పూలు రాజ్యమేలుతాయి, సువాసనలు వెదజల్లుతాయి. చివరికి పండుటాకులుగా, వాడిన పూలుగా మారి నేల రాలుతాయి. కరువు వచ్చే ముందు అందాల ప్రకృతి కనిపించదు. జీవన విసర్జన. చావు. మనుషులు, ఎండుటాకులు, అంతే. చరిత్రను వల్లివేస్తూ, చరిత్రలో వంటరిగా అస్తమించటమే జీవన నియమం.
కొస్కూస్ మంటలో మరో కట్టె వేసాడు. గతం అతని జ్ఞాపకాలలో తిరగసాగింది. మంచు కురవటంమొదలు కాగానే దోమలు మాయమయ్యాయి. చిన్న ఉడత పాకుకుంటూ పోయింది- చావటానికి. కరువు ప్రకృతి తిరోగమనం. మంచులో తను వంటరిగా. ఇది చావు ఆగమనం. ఇది జీవన నియమం. వయసు మళ్లగానే కుందేలు గమనం నెమ్మదించింది, ఆత్మరక్షణ కష్టమైంది. తనలాంటి పెద్ద తలకాయ కూడా వయసుతో చీకటిలోకి చేరి, ఇలా నిస్సత్తువుగా మారి, గుప్పెడు ఎండు కట్టెల రక్షణలో నిలిచింది. తను కూడా ఒక శీతాకాలంలో క్లోండైక్ ఎత్తున తన తండ్రిని వదిలేసాడు, మిషనరీలు టాక్-బుక్స్ మరియు మెడిసిన్ బాక్సులతో రావటానికి ముందు శీతాకాలంలో. ఆ మందుల బాక్స్ గురించి కొస్కూస్ మర్చిపోలేదు. నొప్పులు మాయం చేసే మందు తనకి బాగా నచ్చినది.
కొస్కూస్ మంటలో మరో కట్టె వేసాడు. కరువులో ముసలివాళ్లు ఖాళీ కడుపులతో మంట చుట్టూ చేరుతారు. మూడు శీతాకాలాలలో సువిశాలంగా పుష్కలంగా మరియు మరో మూడు వేసవిలలో మంచుతో కప్పబడి ఉన్న యుకాన్ గతాన్ని నెమరువేసుకొనేవారు. కరువులోనే అతడి తల్లి చనిపోయింది. వేసవిలో సాల్మన్ దొరక్క, శీతాకాలంలో కారిబో (రెయిన్ డీర్) రాక కోసం ఆ తెగ ఎదురుచూసేది. కాని శీతాకాలం వచ్చినా కారిబో రాలేది. ఇది ఏడో సంవత్సరం. కుందేళ్లు దొరక్క కుక్కలు ఎముకల గూళ్లయ్యాయి. సుదీర్ఘమైన చీకటిలో పిల్లలు ఏడుస్తూ చనిపోయారు. ముసలివాళ్లు మరియు ఆడవాళ్లు కూడా. పదిమందిలో ఒకరు బ్రతకటం పరిపాటి అయింది. వసంతంలో వచ్చిన సూర్యుడిని ఆ కొద్దిమంది మాత్రమే చూడగలిగారు. కరువు అంత ప్రతాపం చూపించింది.
పుష్కలంగా తిండి దొరికిన రోజుల్ని కూడా తాను చూసాడు. తమ చేతుల్లో ఆహారం ఎంత తిన్నా తినలేక మిగిలిపోయేది. కుక్కలు తినితిని తెగ బలిసి ఉండేవి, పనికి పనికిరాకుండా. కొన్నాళ్లు వేట ఉండదు. స్తీలు పురుషులు సంతోషంగా ఉండేవారు, గుడారాలు బిడ్డ పాపలతో కోలాహలంగా ఉండేవి. పాకే మగబిడ్డలు ఆడబిడ్డలతో ఆనందం వెల్లివిరిసేది. మగాళ్లు పొట్టనిడా తిని, పురాతన యుద్దవిద్యలు, వేటల్లో ప్రతాపం చూపించేవారు.
దుప్పిని తోడేళ్లు లాక్కుపోతుంటే, జింగ్-హా తాను ఆ పోరాటాన్ని రహస్యంగా చూసారు. ఆతర్వాత జింగ్-హా అత్యంత కుశల వేటగాడిగా పేరుపొందాడు. ఐతే యుకాన్ లోని వాయుబిలలో చిక్కి చనిపోయాడు. ఒక నెల తరువాత మంచులో కట్టెలా గడ్డకట్టి, బిలం దాటుతున్న భంగిమలో దొరికాడు.
ఆరోజు తాను జిగ్-హా తమ తండ్రుల్లాగ వేట నేర్చుకోవటానికి వెళ్లారు. మంచు మీద దుప్పి కాళ్ల చెరగని గుర్తులు చూసారు. వాటి పక్కనే అనేక తోడేళ్ల కాళ్ల గుర్తులూ కనిపించాయి. “దుప్పి ముసలిది. తమ గుంపుతో పరిగెత్తలేక ఒంటరిదైపోయుంది. తోడేళ్లు దాన్నిగుంపు నుంచి వేరు చేసాయి. అవి దాన్ని ఇక వదలవు.”అన్నాడు జిగ్-హా. నిజమే. తోడేళ్లు దుప్పి కొమ్ముల మీద, ముక్కు మీద, వెనుకనుంచి, రకరకాలుగా దాడి చేస్తాయి. చచ్చే వరకు దాన్న అవి వదలవు. ఇదంతా జింగ్-హా వివరించాడు. జీవన నియమం. రాత్రి-పగలు పనిచేయాలి. రక్త దాహం. చరమాంకం చూడవలసిందే మరి. జింగ్-హా, తాను వాటికి కనబడకుండా పొట్టల మీద పాకుతూ వెళ్లి మరో వైపు నుంచి వాటిని చూస్తున్నాం. ఆ దుప్పి రెండు తోడేళ్లని చంపింది. అయినా చావు దగ్గర పడిందని దానికి తెలుసు. దుప్పి నిలబడ్డ దగ్గరికి వాళ్లు పాకుతూ వచ్చారు. ముగ్గరు దృఢకాయులంత భారీ శరీరంతో అది కనిపించింది. మంచుమీద రక్తధారలు. మతి తప్పి నిలబడ్డ దుప్పి మీద ఒక తోడేలు బలంగా దాడిచేసి, దాన్ని ఊపిరి తీసుకోకుండా చేసి, నేలకి కూలిపోయేలా చేసింది. అదే అంతిమ దృశ్యం, అదే చరమాంకం.
ఆ దృశ్యం చాలా భయంకరమైంది. తన జీవితమంతా అది తనతో ఉంది. గతంలో చూసిన ఆ దృశ్యం చివరి వరకు సాగిన ప్రాణరక్షణ పోరాటం. ఆ తర్వాత తెగకి నాయకుడై కొస్కూస్ ఎన్నో సాహసాలు చేసి పేరు తెచ్చుకున్నాడు. అతడు ప్రత్యక్ష పోరాటాలలో అనేకమంది శ్వేత జాతీయులతో కత్తికికత్తి పద్దతిలో పోరాడి మట్టి కరిపించాడు. ఇప్పుడు అతడి చూపులేని కళ్లు ఆనాటి అంతాన్ని గత జ్ఞాపకాలుగా చూడసాగాయి. మంట ఆరిపోకుండా మరో రెండు కట్టెలు మంటలో వేసాడు.
సిట్-కమ్-టు-హా తనొక తాతనని గుర్తు చేస్తుంది అనుకున్నాడు చేతి నిండా దొరికే ఈ కట్టెలను తడుముకుని, అవి ఉన్నంత వరకు తను బ్రతికి ఉండే గంటలు అధికం. జింగ్-హా కొడుకి కొడుకు బీవర్ కన్ను సిట్-కమ్-టు-హా మీద పడ్డనాటి నుంచి తన మనమరాలుకి పెద్దలమీద శ్రద్ధ తగ్గింది. చెప్పుకోవటానికేముంది? వయసులో తాను కూడా అలా చేసినవాడే కదా! కాసేపు నిశ్శబ్దాన్ని అనుభవించాడు. కొడుకు తన కుక్కలతో వస్తాడని, కారిబో (రెయినెడీర్స్) పుష్కలంగా ఉండే ప్రాంతానికి తనని కూడా తమతో తీసుకువెళ్తాడని ఆశించాడు. చాలా సేపు అతడి మనసు గతంలో అలా మునిగి తేలింది.
కళ్లు అలసిపోయాయి. ఆలోచనలు తగ్గాయి. అనంత నిశ్శబ్దంలో అతను ఊపిరి తీసుకుంటున్నాడు. భయంకరమైన ఒంటరితనం. మంట ఆరిపోతుంది. శరీరాన్ని చలి తాకుతోంది. ఇక రెండు కట్టెలే మిగిలాయి. రెండే రెండు కట్టెలు. వాటిలో ఒకటి తీసి మంటలో వేసాడు. ఏమిటీ చప్పుడు? అతని శరీరాన్ని ఆపాదమస్తకం వణింకించింది ఒక చలి కెరటం. తనకి తెలిసిన అరుపులవి. తోడేళ్ల భయంకరమైన అరుపులు. తన చేతికి చాలా దగ్గరగా. అతని కనిపించని కళ్లకి ఆనాటి దుప్పి తన చావుకు ముందు గిజగిజా కొట్టకోవటం కనిపించింది. భారీ శరీరంతో ఆ బలమైన ఎద్దులాంటి దుప్పి. చిందరవందరగా పడి ఉన్నదాని విశాలమైన కొమ్ములు. తెల్లని మంచుపై పడి గడ్డకట్టి ఉన్న దాని రక్తం, బయటకొచ్చిన ఎముకలు, కడుపులోని భాగాలు, వాటిని చీల్చి చకచకా ఆరగిస్తున్న రక్తపిశాచులైన తోడేళ్లు. అవి దానిని చుట్టుముట్టిన విధానం. బూడిదరంగులోని ఆ తోడేళ్ల రక్త దాహం, చీకటిలో చింత నిప్పుల్లా మేరిసే వాటి కళ్లు, పొడవైన రక్తం కారే వాటి నాలుకలు, కత్తులను మించి పదునైన వాటి కోరల్లాంటి పళ్లు. ఇవి అతని కనిపించని కళ్ల ముందు సజీవంగా కదలాడాయి. చల్లని తడి ముక్కు కొస్కూస్ ముఖాన్ని తాకింది. దాంతో అతడు తన ఆలోచనల నుంచి తేరుకున్నాడు. మెరుపు వేగంతో మంటలోంచి కాలుతున్న ఒక కట్టెను చేతిలోకి తీసుకున్నాడు.
తోడేలు మంటను చూసింది. కాని భయపడ లేదు. అది తల వెనక్కి తిప్పి, మిగతా తోడేళ్లని పిలుస్తూ గట్టిగా అరవసాగింది. ఆకలి గొంతుకలతో అరుస్తూ అవి కూడా పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. ఆ తోడేళ్ల ఆకలి అరుపులు ఆ ముసలి రెడ్ ఇండియన్ స్పష్టంగా విన్నాడు. అవి తన చుట్టూ ముట్టడి చేస్తున్నాయని అతడు గ్రహించాడు. అతిని చేతిలో చిన్న మండుతున్న కట్టె. అతడు మండుతున్న ఆ కట్టెని వాటివైపు గాలిలో ఊపాడు, కాని అవి అక్కడ నుంచి పారిపోలేదు. అప్పుడు ఒక తోడేలు నెమ్మదిగా, అతని బలాన్ని పరీక్షించ దలచినట్టు నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత ఒకటి. ఆ తర్వాత మరొకటి. అలా చుట్టుముట్టిన తోడేళ్ల వృత్తం చిన్నదయిపోయింది. వెనక్కి తగ్గిన తోడేలు ఒక్కటి కూడా లేదు. తను ఎందుకు పోరాడాలి? తను ఎందుకు బ్రతికి ఉండాలి? తన చేతిలోని మండుతున్న కట్టెను అతడు వదిలేసాడు. అది నేల మీద మంచులోపడింది, వెంటనే దాని మంట ఆరిపోయింది. అలా చుట్టూ చేరిన తోడేళ్లు ఆ ముసలి రెడ్ ఇండియన్కి దగ్గరగా చుట్టూ గుమిగూడాయి. చనిపోయేముందు గింజుకుంటూ కొట్టుకున్న ఆ దుప్పి చావు దృశ్యం అతడి కళ్ల ముందు మరోసారి కదిలింది. అతడి తల మోకాళ్ల మీద వాలిపోయింది. దీని ప్రత్యేకత ఏముంది?
ఇది జీవన నియమం కదా?
sunkarabhaskararao14@gmail.com
Imprint
Publication Date: 08-28-2017
All Rights Reserved
Dedication:
ఒంటిరిగా నిస్సహాయంగా మంచుమీద కూర్చున్న తాత. జాలి చూపించే సమయంలేక ఆమె వెళ్లిపోయింది. వేటకు కొత్త మైదానాలు వెదుక్కోవడమే వాళ్ల ధ్యాస. జీవితం ఆమెని పిలుస్తోంది, చావు కాదు. చనిపోవటానికి ఆ తెగ సిద్ధంగా లేదు. ఆమె తాత కొస్కూస్ తప్ప.
Comments (0)