Oke Sanchiloni Uppu Telugu BR Raksun, Melissa Pontes [top ten ebook reader .txt] 📗
- Author: Melissa Pontes
Book online «Oke Sanchiloni Uppu Telugu BR Raksun, Melissa Pontes [top ten ebook reader .txt] 📗». Author Melissa Pontes
MELISSA PONTES
OKE SANCHILONI UPPU
(TELUGU)
Brazilian short Story
translated in Telugu:
BR Raksun
బ్రెజిల్ దేశంలోని ప్రజలకి తరతరాల నుంచి వస్తున్న నమ్మకం ఒకటుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ శాశ్వతంగా ఉండాలంటే వాళ్లు ఒకే సంచిలోని ఉప్పు తినాలి అని. ఈ నమ్మకం వాళ్ల నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంటుంది.
ఈ కథకి ఇదే బ్యాక్ గ్రౌండ్.
రెండు బ్యాగ్ ల సాల్ట్ తీసుకోవాలన్నది ఆమె ఆశ. ఒక్కొక్క బ్యాగ్ లో ఒక పౌండ్ లేదా సగం పౌండ్ సాల్ట్ ఉంటుందేమో, ఆమెకీ సరిగ్గా తెలియదు. ఆమె ఆశ ఒక్కటే. రెండు సాల్ట్ బ్యాగ్ లు.
అతనిలో లోపించిన విశ్వాసం ఈ నిశ్చయానికి దారి తీసింది. పెళ్లి ఆగిపోయింది. అది జరుగుతుందనే నమ్మకం చేయి జారి పోయింది. ఆమె భయపడ లేదు. కనీసం భయపడగూడదని ప్రయత్నించింది. నిర్భయంగా నిర్ణయం తీసుకుంది.
అతని నిర్ణయానికి తలవంచి సరే అంది.
అతడు వెళ్లిపోయాడు. అంతా తుడిచేసి శుభ్రం చేయవలసిన సమయం. ఆమె మనసుని శుభ్రంగా తుడిచి అద్దంలా మెరిసేలా చేసుకోవాలని ఆమె ఆశించింది. అలాగే తన ఇంటిని కూడా. ప్రతి మూలా పరిశుభ్రంగా ఉండేలా శుభ్రం చేయాలని ఆమె అనుకుంది.
మళ్లీ ఒక కొత్త జీవితం మొలకెత్తాలి. కొత్త చిగురులతో. ఆపై పుష్పించాలి. ఫలించాలి. కాబట్టి పాత చెత్త ఊడ్చిపారెయ్యాలి. ఇంట్లోంచి ఒంట్లోంచి కూడా. కాబట్టి ఇంట్లోని సామాన్లన్నీ అమ్మేయాలనుకుంది. అన్నీ. అందుకు ఏర్పాట్లు చకచకా చేసింది. గేరేజ్ సేల్ వాళ్లని ఫోన్ చేసి పిలిచింది. వాళ్లు ఇంట్లో సామాన్లు ఏవైనా సరే, అన్నీ ఒకేసారి కొనేస్తారు. అలాగే ఒకేసారి తెచ్చి ఏవరికైనా అమ్మేస్తారు. ఇంటికి కావాలని కొన్నవి అన్నీ ఆమె ఒకేసారిగా అమ్మేసింది. బెడ్, బాత్, ఇంకా చాలా.
పెళ్లి కోసమని ఆమె కష్టపడి దాచుకున్న డబ్బు, రిసెప్షన్ కోసం ఉంచిన మొత్తం అంతా ఇప్పుడు ఒక కొత్త కారుగా రూపొందింది.
చివరగా మిగిలినవి వెడ్డింగ్ కోసం కొన్న రెండు వెడ్డింగ్ రింగ్స్.- ఆ రెంటినీ అతడు ఆమె దగ్గరే వదిలి వెళ్లిపోయాడు.
నిశ్చితార్థంలో నిశ్చితాభిప్రాయం కుదరక. వీటిని అమ్మాలంటే ఎవరైనా గుండెని రాయి చేసుకోక తప్పదు. అది చాలా కష్టం. వెడ్డింగ్ రింగ్స్ ని కొనటం మాత్రం చాలా సులభం. వాటిని అమ్మటమే మరొక కథ. అలా వాటిని అమ్మి తననుంచి దూరం చేసుకోవటం ఒక కష్టమైన ఉదంతమనే చెప్పాలి.
ఆమె ముఖం మీద సంతోషం మసుగు ధరించింది. రెండు వెడ్డింగ్ రింగ్స్ ని ఒక కవరులో ఉంచింది. కారులో కూర్చుని స్టార్ట్ చేసింది.
గమ్యం ష్రుబిన్. పెర్నాంబుకో రాష్ట్రంలోని ఒక మ్యున్యిపాలిటీ. ఆ పెళ్లి ఉంగరాల సెట్ ని 200 డాలర్లకి అమ్మింది. తన చిలిపి ఆలోచనకి తనలో తానే నవ్వుకుంది. ఇంత బంగారం విలువ 200 డాలర్లేనా? ఈ బంగారంలో తానూ ఉన్నాను కదా అన్న ఆలోచన కావచ్చు.
నిజానికి ఆ ఉంగరాలకి ఎంత ఇస్తారన్నది ఆమెకి ముఖ్యం కాదు. ఆమె ఆ క్షణానికి తాను కావాలనే అతి తక్కువ విలవ ఇచ్చింది. తానే వాటిని అండర్వేల్యుయేట్ చేసింది.
డీల్ కుదరగానే రింగ్స్ ఆమె నుంచి వెళ్లిపోయాయి. ఆమె నిశ్శబ్దంగా ఉంది. మనసుని గుప్పెట్లో ఉంచుకుని. ఈ నిశ్శబ్ద వాతావరణం ఆమెకే సొంతం. ఆమె మనసుకే పరిమితం. ఆమె ప్రపంచానికే అది అనంతం. అతడు ఆమె ప్రపంచానికి సంబంధించిన ఒక భాగం. కాబట్టి ఈ స్తబ్దతలో, ఆమె ఆలోచనల ఈ నిశ్శబ్ద భయంకర వాతావరణంలో అతడు ఒక గత స్మృతుల బాధగా, తెగిన గాలిపటంలా కదులుతూనే ఉన్నాడు. ఈ నిశ్శబ్దం అంతా అతడు లేకపోవటమే. అతడి లేమితో కలిగే కలవరపెట్టే బాధ.
ఈ విధంగా కనిపించని అతని జ్ఞాపకాలు ఆమెని క్షణక్షణం రకరకాలుగా ప్రశంసిస్తూ ఆమెని సంతోషపెట్టసాగాయి. ఇప్పుడు ఆమె అతడికి చాలా అమూల్యం. అత్యంత ప్రేమపాత్రం. ఆమెని అతడిప్పుడు తన అనార్కలీగా లేదా తన ముంతాజ్ బేగంగా భావిస్తూ తనకోసం పరితపిస్తూ ఉంటాడు.
అతడు స్పృహలోకి వచ్చాడు. తన తప్పు తెలుసుకున్నాడు. ఆమె తప్ప తనకి మరేమీ అవసరం లేదని అనుకున్నాడు.
ఆమెకి గులాబీలు కొనటానికి పరుగెత్తాడు. ఆమెకి నచ్చిన మంచి సూట్ వేసుకన్నాడు. స్ప్రే కొట్టుకున్నాడు. తన ప్రేమని చాలా అందంగా ప్రకటించుకున్నాడు. చాలా చాలా అందమైన మాటలతో. తనలోని అందమైన ఆలోచనలని ఒక్కొక్కటిగా బయటపెట్టాడు.
అతడు ఆమెని పెళ్లాడిన విషయం అంతర్లీనంగా దాగి ఉంది. తనకి ఆమెతో బెడ్, బాత్, ఆపై ఇంకా అన్నీ కావాలని పట్టుపట్టాడు. తనకి వెడ్డింగ్ రిషప్షన్ కావాలని పట్టుపట్టాడు. అతడు డెజావు మరిచిపోయాడు. (ఫ్రెంచ్ లో ఈ పదానికి అర్థం ఇంతకు ముందు చూచినదీ, అనుభవించినదీ అని).
ఆహా! ఆశలు ఎంత అందంగా ఉంటాయి! వెధవ ఆశలు! ఈ ఆశలు చావక ఆమె బయలు దేరింది మరిన్ని సాల్ట్ బ్యాగ్స్ కొనటానికి. కావలసినన్ని పౌండ్ల ఉప్పు సంచులు. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ శాశ్వతంగా ఉంచేవి ఆ ఉప్పు సంచులే అని ఆమె నమ్మకం. చిన్నప్పటి నుంచీ ఆమెలో గూడుకట్టుకుని ఉన్న నమ్మకం.
(According to regional superstition in Brazil, in order for a love story to last, lovers need to eat from the same bag of salt.)
Imprint
Text: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 07-14-2015
All Rights Reserved
Comments (0)